వడ్డీ వ్యాపారి వేధింపులు, మోసం

  • భరించలేక చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి- మేడికొండూరు (గుంటూరు జిల్లా) : అసలు కంటే వడ్డీ అధికంగా వసూలు చేయడంతోపాటు ఉన్న కొద్దిపాటి పాలాన్నీ కాజేసిన వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక బిసి సామాజిక తరగతికి చెందిన చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. దీనిపై బాధితుడు లేఖ రాయడంతోపాటు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. బాధితుని కథనం ప్రకారం… మేడికొండూరుకు చెందిన వేములకొండ శరత్‌కుమార్‌ కూరగాయల విక్రయిస్తూ ఉంటారు. వ్యాపార అవసరాల కోసం స్థానిక వడ్డీ వ్యాపారి నెలకుదిటి చైతన్య వద్ద రూ.5 లక్షలను కొన్నాళ్ల క్రితం తీసుకున్నారు. అప్పుతోపాటు వడ్డీని రూ.10 లక్షల వరకు విడతల వారీగా చెల్లించారు. అయితే, ఈ తర్వాత శరత్‌కుమార్‌ తల్లిదండ్రులను చైతన్య పిలిపించారు. ‘మీ అబ్బాయి అప్పు తీసుకున్నాడు. వడ్డీ చాలా అయింది. కొంత కట్టినా ఇంకా రూ.10 లక్షలు కట్టాలి. అప్పునకు బదులుగా శరత్‌కుమార్‌, ఆయన సోదరుని పేరుతో సర్వే నంబర్‌ 21/2లోని నివాస స్థలాన్ని ఇవ్వాలి’ అని ఒత్తిడి చేశారు. ఇందుకు శరత్‌కుమార్‌ తల్లిదండ్రులు అంగీకరించారు. చైతన్య అంతటితో ఆగకుండా శరత్‌కుమార్‌ కుటుంబం నివాసం ఉండే పోరంబోకు స్థలంలోని ఇంటిపైనా కన్నేశారు. ఆ ఇంటిని తనఖా పెట్టించి లోన్‌ ఇప్పిస్తామని శరత్‌కుమార్‌ తల్లిదండ్రులను నమ్మించారు. లోన్‌ పొందడానికి అవసరమైన రిజిస్ట్రేషన్‌ పత్రాలనూ రెవెన్యూ, రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పుట్టించారు. రూ.7 లక్షల లోన్‌ మంజూరవగా దాన్ని కూడా ముందుగానే పథకం ప్రకారం రాయించుకున్న చెక్కులతో డ్రా చేసుకున్నారు. లోన్‌ తమ ఖాతాలో జమైనట్లు శరత్‌కుమార్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ మేసేజ్‌ రాగా దాన్ని తీసుకుని వారు బ్యాంకుకు వెళ్లారు. తీరా ఆ డబ్బులు డ్రా అయినట్లు శరత్‌కుమార్‌ తెలుసుకొని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో, లేఖ, సెల్ఫీ వీడియో ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అనంతరం స్థానిక కోల్డ్‌ స్టోరేజీ సమీపంలో పురుగుల మందు తాగారు. వెళ్తున్న వారు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా, వారు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)కు ఆయనను తరలించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆస్పత్రి నుండి బాధితుని వాగ్మూలం వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని మేడికొండూరు సిఐ డి.జయకుమార్‌ తెలిపారు.

➡️