నియంతృత్వంపై ప్రజాయుద్ధమే ‘యువగళం’

Dec 18,2023 22:16 #Nara Lokesh, #yuvagalam padayatra
  •  పాదయాత్ర ముగింపులో నారా లోకేష్‌
  •  226 రోజులు.. 3132 కిలోమీటర్ల నడక

ప్రజాశక్తి – గాజువాక, ఉక్కునగరం : విలేకరులు (విశాఖపట్నం)రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నియంతృత్వంపై ప్రజా యుద్ధమే తాను చేపట్టిన యువగళమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. తన పాదయాత్ర అణచివేతకు గురైన వర్గాల గొంతుకైందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర 226 రోజులపాటు 3132 కిలోమీటర్లు సాగి విశాఖలోని అగనంపూడి శివాజీనగర్‌ వద్ద ముగిసింది. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను కార్యకర్తల నడుమ లోకేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి, వ్యవస్థల విధ్వంసాన్ని తాను కళ్లారా చూశానని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు యువగళం యాత్ర భరోసానిచ్చిందన్నారు. అందరి సహకారంతో ఈ సుదీర్ఘ యాత్ర సాగించినట్టు వెల్లడించారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటానన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని నెరవేరుస్తామని ప్రకటించారు.

ప్రజలను పలకరిస్తూ.. ఉత్సాహంగా చివరి రోజు యాత్ర

ఉక్కునగరంలోని సిడబ్ల్యుసి-1 నుంచి యువగళం పాదయాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. పాదయాత్రకు ముందు నారా భువనేశ్వరి, పార్టీ నాయకులతో లోకేష్‌ కాసేపు చర్చలు జరిపారు. టిడిపి, జనసేన నాయకులు పల్లా శ్రీనివాసరావు, కోన తాతారావులు పాదయాత్రలో పాల్గొన్నారు. నెహ్రూ పార్కు, తెలుగు తల్లి విగ్రహం, వై.జంక్షన్‌, గంగవరం పోర్టు, చినగంట్యాడ, జగ్గు జంక్షన్‌, వడ్లపూడి, కూర్మన్నపాలెం మీదుగా యాత్ర అగనంపూడి వరకూ సాగింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకోవాలని, సొంత గనులు కేటాయించాలని పలువురు ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. గంగవరం పోర్టు నిర్వాసితులు, ఉద్యోగులు, టూ వీలర్‌ మెకానిక్‌లు తమ కష్టాలను లోకేష్‌కు చెప్పుకొచ్చారు. న్యాయవాదులు, కాంట్రాక్ట్‌ కార్మికులు, అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి లోకేష్‌ వినతులు స్వీకరించారు. అగనంపూడి పైలాన్‌ వద్ద ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. చివరి రోజు యాత్రలో లోకేష్‌ వెంట తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావు, ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త ప్రత్తిపాటి పుల్లారావు, నాయకులు శ్రీభరత్‌, కొల్లు రవీంద్ర, అమర్‌నాథ్‌ రెడ్డి, టిడి.జనార్థన్‌, వంగలపూడి అనిత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు. లోకేష్‌ యాత్రకు చివరి రోజు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. వేలాది మంది టిడిపి అభిమానులు పాల్గొన్నారు.

➡️