గుంటూరులో వైసిపి కార్యాలయంపై దాడి

  • 32 మంది అరెస్టు
  • ఓటమి భయంతో టిడిపి దాష్టీకం : మంత్రి రజని

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో వైసిపి పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత టిడిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయం వాచ్‌మెన్‌ ఫిర్యాదు మేరకు 32 మందిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల కథనం ప్రకారం… వైసిపి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న మంత్రి విడదల రజని స్థానిక సాయిబాబా రోడ్డు ఎదుట కార్యాలయం ఏర్పాటు చేశారు. సోమవారం ఈ కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో భారీ ఫ్లెక్సీలతో అలంకరణ చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని యువకులు పెద్ద సంఖ్యలో అక్కడే ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్దకు చేరారు. ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించే క్రమంలో కొంతమంది యువకులు వైసిపి కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. ఈదాడిలో మొదటి, రెండంతస్తుల అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనను మంత్రి విడదల రజని ఖండించారు. బిసి మహిళగా ఉన్న తన ఎదుగుదలను చూసి ఓర్వలేక, ఓటమి భయంతో తన కార్యాలయంపై టిడిపి గూండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులు ఎంతటి వారైనా ఒదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అయితే ఈ ఘటనను ఆసరాగా చేసుకుని టిడిపి కార్యాకర్తలపై అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ఈ ఘటనపై న్యాయవిచారణ చేయాలని కోరారు. విడదల రజని గుంటూరు రావడం ఇష్టం లేకనే వైసిపి నాయకులు ఈ దాడి చేయించి ఉంటారని, ఇదే సమయంలో అక్కడున్న టిడిపి కార్యకర్తలను అరెస్టు చేశారని విమర్శించారు.

➡️