ఉగాది నాడూ పస్తులే!

  • ‘అనంత’ కార్పొరేషన్‌ క్లాప్‌ డ్రైవర్ల నిరసన

ప్రజాశక్తి- అనంతపురం కార్పొరేషన్‌ : ‘వేతనాలు ఇవ్వకుండా పండగ పూట పస్తులుంచారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి?’ అంటూ క్లాప్‌ డ్రైవర్లు ఉగాది రోజున మంగళవారం ఆందోళనకు దిగారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మామిడాకులు మెడలో వేసుకొని, ప్లేట్లు చేతిలో పట్టుకొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, సిఐటియు పట్టణ కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు మాట్లాడారు. గతంలో రెడ్డి ఏజెన్సీ ద్వారా క్లాప్‌ ఆటో డ్రైవర్లకు వేతనాలు చెల్లించేవారని, అయితే వారు ఎనిమిది నెలల వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులు అప్పట్లో ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. బకాయి వేతనాలు చెల్లించేలా చూస్తామని, ఇకపై కార్పొరేషన్‌ ద్వారా వేతనాలు ఇస్తామని కార్పొరేషన్‌ కమిషనర్‌ హామీ ఇవ్వడంతో కార్మికులు విధుల్లో చేరారని వివరించారు. పాత బకాయిలు అందకపోగా, మళ్లీ వేతనాలు పెండింగ్‌ పెట్టడంతో క్లాప్‌ ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మలేరియా కార్మికులకు తాజాగా నాలుగు నెలలు, కోవిడ్‌, మలేరియా గ్యారేజ్‌ కార్మికులకు తాజాగా మూడు నెలల వేతన బకాయిలు ఉన్నాయని, పెండింగ్‌ వేతనాలు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

➡️