కురుపాంలో పుంజుకుంటున్న సిపిఎం

May 8,2024 00:31 #vijayanagaram

బృందా కరత్‌ పర్యటనతో నూతనోత్తేజం
-ఆశల పల్లకిలో టిడిపి
– వైసిపికి ఎదురీత
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి:పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సిపిఎం పుంజుకుంటోంది. రెండు దశాబ్దాలుగా కురుపాంలో ఓటమి చవిచూసిన టిడిపి ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర పోటీనిస్తోంది. విజయావకాశాలపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశగా వున్నారు. రెండుసార్లు వరుసగా విజయం సాధించిన వైసిపికి ఈసారి ఓటమి తప్పదనే ఊహాగానాలు, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. జనం ఎర్రజెండా వైపు చూస్తుండటంతో సిపిఎం గట్టి పోటీనిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కురుపాంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
అభివృద్ధికి ఆమడ దూరం
వైసిపి ఎమ్మ్లెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి డిప్యూటీ సిఎంగా పనిచేసినప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికితోడు గడిచిన ఐదేళ్లలో పార్టీలో ఆమె ఏకపక్ష వైఖరి వల్ల సీనియర్లలో చురుకుదనం తగ్గింది. సుదీర్ఘకాలం అన్నీ తానై శ్రీవాణి వ్యవహరించడంతో సీనియర్లు, క్రియాశీలక కార్యకర్తలకు కూడా గ్రామాల్లో పట్టుసడలింది. అలాగే నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా వున్న సమస్యలను పరిష్కరించడంలో ఆమె పూర్తిగా విఫలమయ్యారు. ఏనుగుల సమస్య, సుమారు 45 గిరిజన గ్రామాలకు దూరం తగ్గించే పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం, పోడుపట్టాల పంపిణీ తదితర విషయాల్లో ఆమె ఏమాత్రం చొరవ చూపలేదు. పైగా చేతులు తడిపితే తప్ప పనులు ముందుకు సాగనివ్వలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. లాబేసు వంతనె పనులను సంబంధిత కాంట్రాక్టరు అందుకే నిలిపివేశారంటూ ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజానీకం సైతం చర్చించుకుంటున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన కొన్ని నెలల్లోనే గిరిజన గ్రామాలన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చుతామంటూ ప్రకటించిన శ్రీవాణి, ఆ తరువాత గిరిజనేతర పెత్తందారుల ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గిపోయారు. వీటికితోడు ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం తదితర రంగాలపై నిర్లక్ష్యం, సొంత పార్టీ నాయకులపై ఆధిపత్య ధోరణి వైసిపి బలాన్ని తగ్గించాయి. దీంతో, వైసిపికి ఎదురుగాలి వీస్తోందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.
బిజెపితో పొత్తు వల్ల టిడిపికి ప్రతికూల పవనాలు
వైసిపి బలహీనతలను తనకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితిలో టిడిపి లేదు. నెలరోజుల క్రితం వరకు టిడిపి కూడా గ్రూపుల పోరుతో సతమతమయింది. గ్రూపులను ఎట్టకేలకు ఏకతాటిపైకి తీసుకొచ్చి ఐక్యం చేసినప్పటికీ, బిజెపితో పొత్తు వల్ల ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి స్థానిక గిరిజనురాలైనప్పటికీ, గెలిచాక అధికారం ఆమె చేతుల్లో ఉండే పరిస్థితి లేదనే చర్చ నడుస్తోంది. వైసిపితో పొత్తు లేకుండానే రాష్ట్రంపై పెత్తనం చెలాయించిన బిజెపి, నేడు టిడిపి పొత్తుతో ఎన్నికల్లో గట్టెక్కితే, మరిత ఆధిపత్యం చెలాయిస్తుందని జనం చర్చించుకుంటున్నారు. అదే జరిగితే కొండకోనల్లో నిక్షిప్తమైన బాక్సైట్‌, గ్రానైట్‌ తదితర గనుల కోసం గిరిజనులను అడవి నుంచి దూరం చేస్తారన్న భావన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ఏజెన్సీలోని బొడికొండ, తామరకొండ, బడిదేవర కొండల్లోని గనులను కేంద్రంలోని బిజెపి కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అరకు పార్లమెంటు స్థానానికి ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి గీతపై ఉన్న అవినీతి, కుల వివాద కేసులు కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పలువురు అంటున్నారు.
ఉత్సాహంగా సిపిఎం కార్యకర్తలు
ఇప్పటికే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రెండేసి రోజుల చొప్పున నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి గత నాలుగు రోజులుగా వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దీంతో, పార్టీ కార్యకర్తలు నూతనుత్తేజం ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ సిపిఎం ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు పి అప్పలనర్స, మండంగి రమణను గెలిపించాలని కోరుతూ ప్రజలకు చేసిన విజ్ఞప్తి సానుకూల ఫలితాలను ఇస్తోంది. మరో ఆరు రోజుల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ వైసిపి, టిడిపి ముఖ్యనేతలెవరూ రాకపోవడంతో ఆయా పార్టీ శ్రేణుల బేలచూపులు చేస్తున్నాయి. సిపిఎం రాష్ట్ర, జాతీయ నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికిన తీరుతెన్నులు, సభలకు కదిలివచ్చిన జనం 2004 నాటి పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి. సిపిఎం కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ సర్పంచుగా, ఎంపిటిసి సభ్యుడిగా, వీటన్నింటికీ మించి గిరిజన సంఘం, సిపిఎం నాయకుడిగా నియోజకవర్గ వాసులకు సుపరిచితుడు. అన్యాయం జరిగిన ప్రతిచోటా నిలదీసే ధైర్యం, తెగువ ఉన్న నాయకుడిగా ముద్రవేసుకున్నారు. వీటన్నింటికి ఈ ప్రాంతంలో సిపిఎం పునాదులు తోడవుతున్నాయి. ఈ త్రిముఖ పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో? అందుకు ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో వేచి చూడాల్సిందే.

➡️