విశాఖలో కూటమి అగచాట్లు

Apr 11,2024 03:50 #2024 elections, #ap election, #vizag
  •  పలు అసెంబ్లీ సీట్లలో అసంతృప్తులు
  •  ఎంపి స్థానం కోసం బిజెపి నేత జివిఎల్‌ పట్టు
  •  ఢిల్లీకి లేఖల పర్వం

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ జిల్లాలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అగచాట్లు పడుతోంది. అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీల నేతల మధ్య నేటికీ అసంతృప్తులు కొనసాగుతున్నాయి. ఇవి ఆయా పార్టీల అధిష్టానాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విశాఖ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టిడిపి తరపున ఎంపి అభ్యర్థిగా శ్రీభరత్‌ పోటీ చేస్తున్నారు. అయితే బిజెపి నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ జివిఎల్‌ నరసింహారావు ఇంకా తనకు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఢిల్లీకి పలుసార్లు వెళ్లడం, విశాఖ నుంచి తన అనుచరులతో అమిత్‌ షా, మోడీకి లేఖలు రాయించడం కొనసాగిస్తున్నారు. అధిష్టానం బుజ్జగించినా ఇప్పటికీ మెత్తపడలేదు. అసంతృప్తి గళాన్ని వినిపిస్తూ, తన అనుచురులతో నిరసనలకు దిగుతున్నారు. వైసిపి అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీలక్ష్మి పార్లమెంటు బరిలో దిగారు. కాపు సామాజిక తరగతి ఓట్లు పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉండడం, స్థానికురాలు అనే ఎత్తుగడతో ఆమె పేరును వైసిపి అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.

అసెంబ్లీ సీట్లలో పరిస్థితి ఇలా..
విశాఖ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్‌లో టిడిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు టికెట్‌ దక్కింది. వైసిపి నుంచి ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం విశాఖ ఎంపిగా ఉన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఖాయం అయినప్పటి నుంచీ వార్డుల్లో పాదయాత్రలు చేస్తూ ఎంవివి ముందుకెళ్తున్నారు. ఇక టిడిపి అభ్యర్థి వెలగపూడి ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరుసగా గెలిచారు. అయితే గతంలో ఆయనకు సహకరించిన సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఇటీవల వైసిపిలో చేరడం టిడిపికి ఈ సెగ్మెంట్‌లో పెద్ద ఎదురుదెబ్బే.
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా వాసుపల్లి గణేష్‌కుమార్‌ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ఆయన తరువాత కాలంలో వైసిపిలోకి జంప్‌ అయ్యారు. ఇక్కడ కూటమి నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు. ఆయన కొద్ది నెలల క్రితం వరకూ వైసిపిలో కీలకంగా వ్యవహరించారు. తదనంతర కాలంలో పార్టీపై విమర్శలు గుప్పిస్తూ రాజీనామా సమర్పించారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఆయనకు దక్షిణంలో టికెట్‌ ఇవ్వడం పట్ల జనసేన, టిడిపి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తూ జనసేన శ్రేణులు నిరసనలకు దిగుతున్నాయి. అయితే టిడిపి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ వంటివారు తన గెలుపునకు కృషి చేస్తారన్న ఆశతో వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఉన్నారు.
ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా కెకె రాజు బరిలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుపై ఓటమి చెందారు. అయినప్పటికీ ఈ ఐదేళ్లూ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఆయనపై కొంత సానుభూతి వ్యక్తమవుతోంది. కూటమిలో బిజెపికి ఈ సీటు దక్కింది. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆ పార్టీ తరపున మళ్లీ పోటీ చేస్తున్నారు. 2014లో గెలిచినప్పుడు తమను పట్టించుకోలేదంటూ ఆయనపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జనసేన సహకారం కూడా ఈ నియోజకవర్గంలో ఆయనకు పూర్తి స్థాయిలో దక్కడం లేదు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 2019లో టిడిపి నుంచి గెలిచిన పెతకంశెట్టి గణబాబు ఈసారీ పోటీ చేస్తున్నారు. ఆయనపై వైసిపి అభ్యర్థిగా విశాఖ డెయిరీ ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌ కుమార్‌ బరిలో నిలిచారు. గణబాబుపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది.
గాజువాక నియోజకవర్గం నుంచి టిడిపి తరపున మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పోటీలో ఉన్నారు. గతంలో ఆయన అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ఆయన మెతకగానే ఉన్నారు. ఈ ప్రాంత వాణిని వినిపించలేదు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు పూనుకున్న బిజెపితో టిడిపి, జనసేన పొత్తుపెట్టుకోవడం పట్ల కూటమిపై కార్మికవర్గం, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. టిడిపి అభ్యర్థి పల్లాకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి సిపిఎం అభ్యర్థిగా ఎం జగ్గునాయుడు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని రెండు వార్డుల్లో ప్రస్తుతం సిపిఎం, సిపిఐ కార్పొరేటర్లు ఉండటం, కార్మికవర్గం పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలోనే నివసిస్తుండటం సిపిఎంకు కలిసొచ్చే అంశం. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు నిబద్ధతతో సిపిఎం, వామపక్షాలే పోరాడుతున్నాయన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది.
భీమిలి అసెంబ్లీ స్థానానికి సంబంధించి టిడిపి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. తొలి నుంచీ ముత్తంశెట్టి ప్రచారంలో ఉన్నప్పటికీ గంటా బలమైన అభ్యర్థి కావడంతో వైసిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

➡️