అభ్యర్థుల ఎంపికలో తీవ్ర ఇబ్బందులు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి, వైసిపి తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఇరుపార్టీలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో సంబంధం లేని కొత్త అభ్యర్థులను ఈ రెండు పార్టీలూ బరిలో దింపాయి. పార్టీలో సీనియార్టీ, నిబద్ధతను పక్కనపెట్టి డబ్బు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేశాయన్న విమర్శలు అటు ఎన్‌డిఎ కూటమి, ఇటు వైసిపికి చెందినవారి నుంచే బలంగా విని పించాయి. గుంటూరు లోక్‌సభ స్థానానికి టిడిపి నుంచి ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఎంపిక చేశారు. మొత్తం రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తారన్న ప్రచారం ఉంది. వైసిపి నుంచి పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను ఖరారు చేశారు. కానీ, ఆయనను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆశించిన విధంగా ఆయన ఖర్చు చేయడం లేదనే భావన ఇందుకు కారణమని పార్టీ వైసిపి వర్గాల్లో వినిపిస్తోంది. ఇండియా వేదిక నుంచి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ లోక్‌సభకు పోటీలో ఉన్నారు. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడంతో వైసిపి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గుంటూరు పశ్చిమ నుంచి వైసిపి నుంచి మంత్రి విడదల రజిని పోటీలో ఉండగా, టిడిపి తరుఫున రియల్టర్లు గల్లా రామచంద్రరావు సతీమణి మాధవికి అవకాశం దక్కింది. ప్రచారంలో మాధవి వెనుకబడ్డారు. ఆమెకు ప్రజా సంబంధాలు లేవు. మంత్రి రజిని ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. గుంటూరు తూర్పు నుంచి వైసిపి తరఫున ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తే నూరి ఫాతిమా బరిలో నిలిచారు. టిడిపి అభ్యర్థిగా నజీర్‌ అహ్మద్‌ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలి పోటీ చేయనున్నారు. మంగళగిరి నుంచి టిడిపి తరఫున మాజీ మంత్రి నారా లోకేష్‌ పోటీ చేస్తున్నారు. ఆయనపై మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు మరుగుడు లావణ్య పోటీలో ఉన్నారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి బరిలో నిలిచారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. తెనాలి నుంచి వైసిపి తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పోటీలో ఉండగా, కూటమి నుంచి జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్‌ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు టిడిపి టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన అను యాయులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో, ఈ నియోజకవర్గంలో జనసేనకు టిడిపి నుంచి అసమ్మతి ఎదురవుతోంది. కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

➡️