ముస్లింలపై విద్వేషం రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో బిజెపి వీడియో

  • తక్షణమే తొలగించాలని ‘ఎక్స్‌’కు ఇసి ఆదేశం

న్యూఢిల్లీ : బిజెపి సాగిస్తున్న విద్వేష ప్రచారంపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం(ఇసి)లో కాస్తయినా కదలిక వచ్చింది. ముస్లింపై ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టేలా బిజెపి పోస్టు చేసిన వీడియోను తక్షణమే తొలగించాలని ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)ను ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశించింది. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలకు అనుకూలమని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు కేటాయించించాల్సిన నిధులను కూడా ముస్లింలకే తరలిస్తుందని అర్థం వచ్చేలా ఆ వీడియోను బిజెపి రూపొందించింది. బిజెపి కర్ణాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర తన అధికారిక ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేని, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీని కించ పర్చేలా కూడా పలు వ్యంగ్య చిత్రాలున్నాయి. ఈ వీడియోపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఐక్యతను దెబ్బతీసేవిధంగా బిజెపి పోస్టు చేసిన ఈ వీడియోను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 5న ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇసి చర్యలు చేపట్టింది. తక్షణమే వీడియోను తొలగించాలని ‘ఎక్స్‌’ నోడల్‌ అధికారికి ఇసి నోటీసులు పంపింది. గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆదేశించినప్పటికీ .. పార్టీ ఆ పోస్ట్‌ను తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరకర పోస్ట్‌పై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. ‘ఈ పోస్ట్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అయినా ఇప్పటికీ పోస్ట్‌ను తొలగించలేదు. తక్షణమే తొలగించాలి’ అని ఇసి తన ఉత్వర్వుల్లో పేర్కొంది.

➡️