Encounter: బీజాపూర్‌ జిల్లాలో నెత్తుటి ధార

-పోలీసుల కాల్పుల్లో డిప్యూటీ కమాండర్‌తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి
ప్రజాశక్తి-చింతూరు (అల్లూరి జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని దండకారణ్య అటవీ ప్రాంతం మళ్లీ తుపాకీ తూటాల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్‌ జిల్లా సుకుమా సరిహద్దు ప్రాంతం బాసగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చిప్పూరుబట్టి, పూసుబ్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్‌ సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల కథనం ప్రకారం… బాసగూడ గ్రామంలో మంగళవారం జరిగిన హోలీ పండగలో ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు కాల్చి చంపడంంతో సమీప అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పదవ ప్లాటూన్‌ మావోయిస్టు డిప్యూటీ కమాండర్‌ నగేష్‌, ఆయన భార్య సోని, మావోయిస్టులు గంగి, ముక్కా, సుక్కా, వికాస్‌ మృతి చెందారు. కోబ్రా 229 బెటాలియన్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ఈ ఆపరేషన్‌ నిర్వహించారని, ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన భారీగా పేలుడు సామగ్రిని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని బీజాపూర్‌ జిల్లా ఎస్‌పి జితేందర్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

➡️