నిధులు గంగపాలు..అంగన్‌వాడీలు వీధులపాలు : వి. శ్రీనివాసరావు విమర్మ

cpm visit gudlakamma project

ప్రజాశక్తి – ఒంగోలు బ్యూరో : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారని, ఇరిగేషన్‌ నిధులను నీళ్లపాలు చేశారని..రెండు వారాలకు పైగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలను పట్టించుకోకుండా వాళ్లను వీధిపాలు చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. ప్రకాశం జిల్లా నేతలతో కలిసి బుధవారం గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఇటీవల దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. అనంతరం ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏడాది క్రితం గుండ్లకమ్మ గేటు ఒకటి కొట్టుకుపోతే మరమ్మతులు చేయలేదని.. ఇటీవల మరోగేటు కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అసమర్ధతేనని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ కూడా దెబ్బతిందని, కాఫర్‌డ్యాంకు రంధ్రాలు ఏర్పడ్డాయని, రూ. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గుండ్లకమ్మ గేట్లు తుప్పుపట్టి పోయాయని, తన్నితే ఊడిపోయేలా ఉన్నాయన్నారు. గేట్లకు గ్రీజు కూడా పూయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. నిర్వహణ లేకనా లేక నాసిరకంగా నిర్మించినందున గేట్లు పోయాయా? అనేదీ తేలాల్సి ఉందన్నారు. తాత్కాలికంగా షట్టర్లు అడ్డం పెట్టినా కిందకు నీరుపోతోందని తెలిపారు. కనీసం ఇరిగేషన్‌ మంత్రి గానీ, ఉన్నతాధికారులు గానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవన్నారు. గుండ్లకమ్మ కింద ఆయకట్టులో మిర్చి పొగాకు ఆరుతడి పంటలు సాగులో ఉన్నాయని, తక్షణం గేట్లకు మరమ్మతులు చేపట్టి సాగర్‌ నుంచి రెండు టిఎంసిల నీటిని తెచ్చి పంటలకు అందించాలని కోరారు. గేట్లు కొట్టుకుపోవడానికి కారకులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రెండు వారాలకుపైగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే సిఎంకు తెలియదంటూ మంత్రులు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని విమర్శించారు. మీరు ఇచ్చిన హామీనే అంగన్‌వాడీలు అమలు చేయాలని కోరుతున్నారని, ఇది కూడా సంక్రాంతి తర్వాత అనడం.. ఎన్నికల తర్వాత అమలు చేస్తామంటూ పూటకో మాట చెప్పడం బాధ్యతాయుతంగా లేదన్నారు. అంగన్‌వాడీల సమ్మెను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అన్ని పార్టీలు, సంఘాలు సంఘీభావం తెలిపాయని, సమస్యలను పరిష్కరించకపోతే వామపక్షాలు కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వాళ్లకు అండగా పోరాడాల్సి వస్తోందని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఆశా వర్కర్లు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ పాల్గొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శనలో పార్టీ జిల్లా నేతలు జివి.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, జె.జయంతిబాబు, స్థానిక నేతలు ఉబ్బా ఆదిలక్ష్మి, సుబ్బారావు ఉన్నారు.

cpm visit gudlakamma project
 
➡️