వలంటీర్ల విధులపై స్పష్టత కరువు

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గందరగోళం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తోన్న వలంటీర్ల విధి, విధానాలపై స్పష్టత కరువైంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా, వలంటీర్లు నిర్వర్తించాల్సిన విధులేమిటి? ఏ పని చేయాలి? ఏమి చేయకూడదు? తదితర అంశాలపై ఇప్పటికీ అయోమయం నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సందర్భంలోనూ ఎన్నికల సంఘం దీనికి సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదు.
వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని, పార్టీలకు ఏజెంట్లుగా ఉండకూడదని మాత్రమే ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. ఇంకా వివిధ అంశాలపై ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో ఆయా జిల్లాల, మున్సిపాలిటీల ఉన్నతాధికారుల దగ్గర్నుంచి వలంటీర్ల వరకూ ఎటువంటి విధుల్లో ఉండాలనే అంశంపై నిర్ధారణకు రాలేకపోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ వలంటీర్ల సేవల వినియోగానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులూ జారీ చేయలేకపోతోంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వలంటీర్లు వివిధ రకాల విధుల్లో నిమగమవుతున్నారని రాజకీయ పార్టీల మధ్య పలుచోట్ల గొడవలూ తలెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం (గ్రామ-వార్డు సచివాలయశాఖ డేటా ప్రకారం) రాష్ట్ర వ్యాప్తంగా 2,56,084 వలంటీర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతినెలా రూ.5 వేలు గౌరవ వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. వైసిపి కార్యకర్తలు, సానుభూతి పరులనే వలంటీర్లుగా నియమించారని, పలు సమావేశాల్లో సిఎంతోపాటు పలువురు నాయకులు కూడా పేర్కొన్నారని, అందుకే వారికి పింఛన్ల పంపిణీ, ఇతర బాధ్యతల నుంచి ఈ ఎన్నికల సమయంలో మినహాయింపు ఇవ్వాలని ఎన్‌డిఎ కూటమి కోరుతుంది. వలంటీర్ల పనితీరు వల్ల ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులూ వెళ్లాయి. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌ ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయొచ్చా ? లేదా అనే విషయంపై కచ్ఛితమైన సమాధానమూ ఇవ్వలేదు. ఉన్నతాధికారులను సంప్రదించగా తమకు ఎటువంటి సమాచారమూ లేదని పేర్కొన్నారు. తమ పేరు పేపర్లలో రాయొద్దని కోరారు.

➡️