శ్రీవారి కానుకలకు ఎట్టకేలకు మోక్షం!

-రూ.2 వేల నోట్ల మార్పిడికి ఆర్‌బిఐ అనుమతి
-తొలివిడత రూ.3.20 కోట్లు మార్పిడికి గ్రీన్‌ సిగల్‌
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:టిటిడి అధికారుల ప్రయత్నం ఫలించింది. శ్రీవారికి హుండీ ద్వారా వచ్చిన రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఎట్టకేలకు క్లియరెన్స్‌ ఇచ్చింది. 2023 అక్టోబర్‌ 7న రెండు వేల రూపాయల నోట్లను ఆర్‌బిఐ రద్దు చేసింది. వీటిని మార్పుకోవడానికి కొంత సమయం ఇచ్చింది. ఈ సమయంలోగా ఆ నోట్లను టిటిడి మార్చుకోలేకపోయింది. ఆ తర్వాత కూడా హుండీ ద్వారా రెండు వేల రూపాయల నోట్లు టిటిడికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటి మార్పిడికి అనుమతి కోసం ఆర్‌బిఐకి టిటిడి పలు దఫాలు లేఖలు రాసింది. దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఉన్న ఈ మొత్తాన్ని మూడు విడతల్లో మార్చుకోవడానికి ఆర్‌బిఐ అనుమతి ఇచ్చింది. మొదటి విడతలో రూ.3.20 కోట్ల మార్పిడికి అనుమతి లభించింది.
జిఎస్‌టి ఎత్తివేయాలి : కేంద్రానికి టిటిడి అధికారుల విజ్ఞప్తి
భక్తులకు సేవలందిస్తున్న నేపథ్యంలో టిటిడిపై జిఎస్‌టి భారం సరికాదని టిటిడి అధికారులు ఎనిమిదేళ్లుగా కోరుతున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోంది. టిటిడి ప్రసాదాలు, అన్నదానం కోసం కొంటున్న పప్పులు, నిత్యావసరాలకు సంబంధించి జిఎస్‌టి భారం ఏటా వందల కోట్ల రూపాయలు పడుతోంది. భక్తులకు ఇస్తున్న అద్డె గదులకూ జిఎస్‌టి భారం తప్పడం లేదు.
ఫారెన్‌ కరెన్సీ, విలువైన నాణేల మార్పిడికీ అనుమతి ఇవ్వాలి
ాశ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి
రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ఆర్‌బిఐ క్లియరెన్స్‌ ఇవ్వడం పట్ల శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి టిటిడి వద్ద ఉండిపోయిన ఫారెన్‌ కరెన్సీ, విలువైన నాణేల మార్పిడికి కూడా అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

➡️