కొత్తూరు జ్యూట్‌మిల్లు వెంటనే తెరిపించాలి

  •  కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : మూసివేసిన కొత్తూరు జూట్‌మిల్లును వెంటనే తెరిపించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మిల్లు గేటు వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి టిఎన్‌టియుసి అధ్యక్షులు కోలా ఉమాశంకర్‌, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సిఐటియు ఏలూరు నగర కార్యదర్శి వీరంకి సాయి మాట్లాడారు. 25 సంవత్సరాల చరిత్ర గల కొత్తూరు జ్యూట్‌మిల్లును చట్టవిరుద్ధంగా మూసివేయడాన్ని ఖండించారు. ఆదివారం యాజమాన్యం మిల్లు వద్ద నోటీసు బోర్డు పెట్టిందని, ఆర్థిక వనరులు సమకూరకపోవడం వల్ల జ్యూట్‌మిల్లును నడపలేకపోతున్నామని నోటీసులో పేర్కొన్నారని, అది చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రభుత్వ అధికారులకుగానీ, కార్మిక సంఘాలకుగానీ ముందుగా తెలియజేయకుండా నోటీసు బోర్డులో పెట్టి మిల్లు నడపలేకపోతున్నామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తక్షణం మిల్లు తెరిపించే చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. సుమారు మూడువేల మంది కార్మికులు పని చేస్తున్న జ్యూట్‌మిల్లును తెరిపించేలా తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా మిల్లును మూసివేసిన మేనేజ్‌మెంట్‌పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టిడిపి ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకష్ణ (చంటి) హాజరై మద్దతు తెలిపారు. మిల్లును మూసి వేయడం చాలా బాధాకరమన్నారు. కార్మికులకు ఏ అవసరం వచ్చినా ముందుంటానని, సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ధర్నాలో సిఐటియు ఏలూరు నగరాధ్యక్షులు జగన్నాథం, ఐఎఫ్‌టియు ఏలూరు నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, కార్మికులు నాగేశ్వరరావు, సూరిబాబు, శ్రీనివాసు, రమణ భూషణం, తదితరులు పాల్గొన్నారు.

➡️